Sangareddy Hydra : హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్

  • నిందితుడు ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా
  • డికాయ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
  • వివరాలు వెల్లడించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

Sangareddy Hydra : హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హాను డికాయ్ ఆపరేషన్ లో నిందితున్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. బండ్ల విప్లవ్ సిన్హా అమీన్ పూర్ గ్రామంలో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పని చేస్తున్నాడని, ఇతని సొంత గ్రామం ఖమ్మం అని అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా అమీన్ పూర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడని, అమీన్ పూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగా ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని, అమీన్ పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా.. ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి ప్రభుత్వ స్థలాల్లో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించి, వారిని ఎలాగైనా బెదిరిస్తే వారి వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకొని అతని ఇంటికి సోషల్ వర్కర్ ఆక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడని తెలిపారు.

Also Read: అందకారంలో నల్లగండ్ల

అప్పటి నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో, చెరువులు, కుంటలకు ఆనుకొని మరియు ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే అట్టి ఇంటి యజమానులు, బిల్డర్ల వద్దకు వెళ్లి వారిని బెదిరించి, వారి గురించి పేపర్ లో రాయిస్తానని కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. గత కొంతకాలంగా నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా నివాసం ఉండే సాయి విల్లాస్, ఫ్యూజన్ స్కూల్ వెనకాల అమీన్ పూర్ చెరువు నుండి వచ్చే నాలాకు అనుకొని ఎంసిఓఆర్ ప్రాజెక్టు ఎల్ఎల్పీ పేరుతో ఒక పెద్ద నిర్మాణ సంస్థ విల్లా నిర్మాణాలు చేయుచున్నది. అట్టి ప్రాజెక్టుకు వెళ్లేదారి అమీన్ పూర్ చెరువు మధ్యలో నుండి ఉంది. నిందితుడు అట్టి వ్యక్తుల వద్దకు వెళ్లి మీరు వేసిన రోడ్డు నాలా ప్రవాహానికి అడ్డు వస్తుంది, ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడని చెప్పారు. గత నెల 14 నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ కు వచ్చి వెళ్ళిన తరువాత ఆ రోజు రాత్రి నిందితుడు ఎంసిఓఆర్ ప్రాజెక్టు ఎల్ఎల్పీ రాజేందర్ కు వాట్స్ ఆప్ కాల్ చేసి వారి ప్రాజెక్టు పక్కన గల ఇరిగేషన్ నాలా గురించి కలిసి మాట్లాడాలని అన్నాడు. దానికి అతను సరే అన్నాడు.

Also Read : ఈర్ల చెరువు పరిధిలో ఇళ్ల కూల్చివేత

18న మధ్యాహ్నం పిస్తా హౌస్, అశోక్ నగర్ దగ్గర కలుద్దాం అని వాట్స్ ఆప్ ద్వారా మెసేజ్ చేశాడు. అతను దానికి అంగీకరించి ఆ రోజు కలవడం జరిగింది. అక్కడ నిందితుడు హైడ్రా చైర్మన్ రంగనాథ్ తో దిగిన ఫోటోస్ చూపించి, రంగనాథ్ సారుకి చాలా దగ్గర అని, అమీన్ పూర్ గురించి ఏదైనా నన్నే అడుగుతాడని చెప్పి, ప్రాజెక్టు జోలికి రావోద్దు అంటే నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి, చివరగా 16 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చెప్పారు. దానికి గాను నేను వారికి అన్నీ రకాలుగా సహాయంగా ఉంటానని, లేకపోతే రోజు న్యూస్ పేపర్లలో తప్పుగా రాయిస్తానని బెదిరించాడు. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు వాట్స్ ఆప్ ద్వారా మెసేజ్ లు చేశాడు. ఆ తరువాత మళ్ళీ 25 తేదీన గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ నందు ఏప్రికస్ కాఫీ హౌస్ లో కలుద్దాం అనగా ఆ రోజు అక్కడ అతను, పార్టనర్ తో వచ్చి కలిశాడు. ఆ రోజు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే రోజు పేపర్ లో ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేయిస్తానని, అదే విధంగా హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, డబ్బులు ఇస్తే పేపర్ లో రాకుండా, హైడ్రా ఏమి చేయకుండా చూసుకుంటనని బెదిరించాడు.

Also Read: భారీ వర్షం..రాకపోకలకు అంతరాయం

ఈ నెల 3న రాజేంద్రనాథ్, మంజునాధ్ రెడ్డి, మరొక ఇద్దరు కలిసి నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వచ్చి అతను అడిగిన డబ్బులలో రాజేంద్రనాథ్ 2 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇవ్వగా, డికాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్, అమీన్ పూర్ పోలీసులు అట్టి డబ్బుతో సహా నిందితున్ని పట్టుకోని, కేసు నమోదు చేసి, నిందితున్ని రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా హైడ్రా పేరుతో, బెదిరింపులకు పాల్పడితే అట్టి వ్యక్తుల గురించి సమాచారాన్ని నేరుగా నా నెంబర్ 8712656777 కు ఫోన్ ద్వారా గాని, వాట్స్ఆప్ ద్వారా గాని సమాచారం అందించాలని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు, సీసీఎస్ సీఐ మల్లేశం, ఎస్.బి సీఐ విజయ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends

Follow US

Most Popular